కుంభరాశివారి శరీరం ఆరోగ్యం,ఆదాయం అదృష్టం,లక్షణాలు,గుణగణాలు, ప్రేమ,దాంపత్య జీవితం,కుటుంబం,బలహీనతలు,విద్య,ఉద్యోగం, వ్యాపారం..!!
ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం 1,2,3,4 పాదాలు మరియు పూర్వాభాద్ర 1,2,3 పదాలలో జన్మించినవారు కుంభరాశికి చెందుతారు.
రాశి చక్రంలో కుంభరాశి పదుకొండవది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిరరాశి, వాయుతత్వపురాశి, శీర్షోదయరాశి అని పిలుస్తారు. ఒక జలకుంభము ధరించిన మానవుడు, ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాలలో చెప్పబడినది. జలకుంభము ధరించిన మానవుడు అనగా, ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు.
కుంభరాశిలో జన్మించినవారు పొడవైన,బలిష్టమైనశరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖవర్ఛస్సు ఉంటుంది. సుందరమైనవంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటివారికి కనబడతారు.
కుంభరాశివారికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తరువాతనే కార్యసాధన చేస్తారు. వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. వీరు ఏ పని చేసిన మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశలేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవ్వరికీ తెలియనివ్వరు. కుంభరాశివారు ఎప్పుడూ గుంభనంగా ఉంటారు.
కుంభరాశివారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాలలో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఊగిసలాడుతుంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదముంటుంది.
కుంభరాశివారు ఇంటిభోజనము అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతనవిజయాల కొరకు ప్రయత్నిస్తారు. కుంభరాశివారికి అవేశము,ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావము,ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తాయి.
కుంభరాశివారు సాంకేతిక,వైద్య విద్యలలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు,చిత్రవిచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవము,నేర్పు కలిగి ఉంటారు. అవసర సమయాలలో ధనము లభించకపొయినా, అవసరము లేనప్పుడు ధనము అధికముగా లభిస్తుంది.
కుంభరాశివారు బంధువులు,ఆత్మీయుల అవసరాలకు ధనము సర్ధుబాటు చేసి, వారి ఉన్నతికి తోడ్పడతారు. సమాజములో ఉన్నతస్థానాలలో,గౌరవస్థానాలలో ఉన్నవారి వలన అన్యాయానికి గురి ఔతారు. ఇతరుల పక్షపాతబుద్ధికి నష్టపొతారు. అకస్మాత్తుగా రాజకీయాధికారము చేకూరుతుంది.
కుంభరాశివారు ఏకపక్షముగా పొరబాటుగా తీసుకున్న నిర్ణయాలవలన ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి.
కుంభరాశివారికి వ్యాపారాలు విజయవంతమై లాభము, పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతనప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి ఔతారు. భూములు విలువ పెరగడమువలన ధనవంతులు ఔతారు.
కుంభరాశివారు అదృష్టమువలన మంచిస్థితికి చేరుకుంటారు. స్త్రీ సంతానముపట్ల అభిమానము అధికము. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారి తీస్తాయి. వీరు అందలము ఎక్కించి బలోపేతము చేసిన అసమర్ధులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులు ఔతారు.
కుంభరాశివారు పోటీ లేనిచోట్లకూడా వీరి మంచితనమువలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలరు. అయినా స్వయంకృతాపరాధాన్ని సరిదిద్దుకోలేరు.
కుంభరాశివారికి భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది. హస్తవాసి మంచిదని పేరు వస్తుంది. సొదరసోదరీ వర్గానికి సహాయము చేయడమువలన మరోవర్గము దూరము ఔతారు. పైస్థాయి,కిందస్థాయివారివలన ఏకకాలములో ఇబ్బందులు ఎదురౌతాయి.
కుంభరాశివారికి ఆత్మీయవర్గము ద్రోహము చేస్తే తప్ప, ఏ విషయమునకు లోటు ఉండదు. ఆధ్యాత్మికంగా,వృత్తి ఉద్యోగాలపరంగా అనేక రంగాలలో అనుభవము గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వము తేలికగా గ్రహిస్తారు. వీరికంటే వెనుక వచ్చినవారు వీరిని అధిగమించి ముందుకు సాగినా దీర్ఘకాలములో వారిని వీరు అధిగమించగలరు.
కుంభరాశివారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్థులు పోగొట్టుకున్నా స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు. శత్రువర్గముమీద విజయము సాధిస్తారు. శత్రువులవలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయివారివలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారివలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కుంభరాశి వాయు తత్వరాశి. వీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ,పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికి తెలియదు. సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్తకొత్త పథకాలను తయారుచేయడం కొరకు అనేకమందిని కలుసుకుంటారు. కొత్తవిషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారు. నూతనప్రదేశాలను సందర్శించడం వీళ్ళకి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయడంకూడా వీరికి చాలా ఇష్టము.
కుంభరాశివారికి బంధాలు అనుబంధాలు ఎక్కువని చెప్పవచ్చు. తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను, స్నేహితులను, వీరు మరవరు.
కుంభరాశివారికి శుక్ర,శని,బుధ మహర్దశలు యోగిస్తాయి.
శరీరం & ఆరోగ్యం: కుంభరాశికి చెందినవారు అందంగా కోమలమైన మనసును కలిగి ఉంటారు. సున్నిత స్వభావులుగా ఉండటంవల్ల చిన్నమాట అన్నా నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వరం నిర్ణయాలు తీసుకోలేనివారుగా ఊగిసలాడతారు. ఫలితంగా కొన్నిసార్లు సమస్యలలో చిక్కుకునే అవకాశం ఉంది.
ఆర్థిక స్థితి: ఈ రాశివారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా, వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. గ్రహాలు అనుకూలంగా ఉండటంవల్ల కాస్తంత రుణబాధలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా వ్యాపారవిషయాల్లో చురుకుగా వ్యవహరించటంవల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలిగి పోగలవు.
ఆదాయం మరియు అదృష్టం : కుంభరాశి చెందినవారు వృత్తి వ్యాపారాలములందు విజయవంతులుగా ఉంటారు. వీరి జీవితగమనంకూడా సుఖసంతోషాలతో గడిచిపోతుంది. గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటంవల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు.
వృత్తి ఉద్యోగాలు : కుంభరాశికి చెందినవారు వైజ్ఞానిక తదితర రంగాలలో స్థిరపడతారు. అంతేకాదు వైద్యవృత్తిలోనూ రాణిస్తారు. మొత్తంమీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించుకుని అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు. సాంకేతికరంగంలో ప్రవేశించినా విజయం సాధిస్తారు.
ప్రేమ సంబంధం: కుంభరాశికి చెందినవారు అత్యంత ప్రేమను కలిగి ఉండేటట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది. అయితే వీరి ప్రేమముందు వారు తక్కువే అని చెప్పవచ్చు. కుంభరాశివారు తమ హృదయంలో ప్రేమికులకు చోటిస్తే అది పదిలంగా ఉంటుంది. అయితే అలాగని అది హద్దులు దాటి విపరీతానికి దారితీయదు. తాను ప్రేమించిన వారిపట్ల అత్యంత స్పష్టంగా వ్యవహరిస్తారు.
వ్యాపారం: ఈ రాశివారికి నవగ్రహాలు లాభనష్టాలను కలిగిస్తాయి. అయినా ఎటువంటి కష్టనష్టాలు ఎదురుకావు. వివాహప్రయత్నాలు,వ్యాపార వ్యవహారాలు తప్పకుండా లాభిస్తాయి.
గుణగణాలు: సన్నగా పీలగా ఉంటారు. అయినా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తుతో తెల్లనిరంగుతో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం. అందరికీ సాయం చేసే లక్షణాలు కలిగిన ఈ రాశివారు మిగిలిన రాశులువారితో అత్యంత స్నేహపాత్రంగా మెలగుతారు. ఇతరులకు సాయపడే గుణంవలన వీరంటే అందరూ ఇష్టపడతారు. ఇతురులను అవహేళనచేసి మాట్లాడటం అంటే వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారంటే ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులను చేతల్లోకాక మాటల్లో చూపిస్తారు. వీరు ముక్కుసూటి తనం శత్రువులను కూడా తెచ్చి పెడుతుంది. అయినప్పటికీ తమకంటూ ఉన్న నియమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. అలాగే వీరిలో కాస్తంత నిర్లక్ష్య వైఖరితోపాటు మొండి పట్టుదలకూడా ఉంటుంది. ఫలితంగా అనవసర సమస్యలలో చిక్కుకుంటారు.
దాంపత్య జీవితం: కుంభరాశికి చెందినవారు ఏ సమస్యనైనా చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారం కనుగొంటారు. ఇందువల్ల వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవటంవంటివాటిని వీరు ఇష్టపడరు. ఇక స్త్రీల విషయానికి వస్తే తమ వైవాహిక జీవితం పదికాలాలపాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ విశేషమైన పూజలు ఆచరిస్తారు. భార్యాభర్తలు పరస్పరం ప్రేమాభిమానాలతో గౌరవించుకుంటారు. ఫలితంగా వీరు కుటుంబంలో దాదాపు చిన్నచిన్న స్పర్థలకుకూడా తావే ఉండదు. ఇక వివాహం కావలసినవారి విషయానికివస్తే ఆధునిక భావాలను అంగీకరించనికారణంగా కాస్తంత ఆలస్యమైనా వివాహానంతరం సుఖశాంతులతో జీవనం కొనసాగిస్తారు.
విద్య: కుంభరాశికి చెందినవారు ఇంజినీరింగ్ తదితర టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు. ఏరోనాటికల్,రీసెర్చ్ సంబంధిత కోర్సులను చేస్తారు. శాస్త్ర,సాంకేతిక రంగాలలో అగ్రగామిలుగా నిలుస్తారు.
గృహం మరియు కుటుంబం: కుంభరాశికి చెందినవారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారుగా ఉంటారు. అంతేకాదు కుటుంబపరంగా వారికి ఏ లోటూ ఉండదు. వీరికున్నటువంటి త్యాగగుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీరి జాతక ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకూ విశ్రమించరు. దీనితో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. వీరికి మంచి యోగ్యవంతులైన సంతానం కలుగుతారు.
సహజమైన బలహీనతలు: కుంభరాశికి చెందినవారు తమదైన శైలిలో జీవనం సాగించటమేకాకుండా తాము చెప్పిందే వేదమన్నట్లు ప్రవర్తించటమనే లక్షణమే వీరికి పెద్ద బలహీనతగా ఉంటుంది. ఈ గుణంవల్ల ఇతురులు ఏది చెప్పినా పట్టించుకోని స్థితిలో ఉంటారు. వారు చేసిన సహాయనికి సంబంధించి వారికి లభించే కృతజ్ఞతలను ప్రతిసారి అపార్థం చేసుకుంటుంటారు. వారి చుట్టూ ఆధిపత్య ధోరణిని ఉండటాన్ని సహించరు. మానవతా వాదంలో వీరు అంత త్వరగా అందరికి అర్ధం కారు.
వ్యక్తిత్వం: కుంభరాశికి చెందినవారు సూటైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తాము అనుకున్న పనిని సాధించేవరకూ విశ్రమించనివారుగా ఉండే కుంభరాశివారు ఇతరులు కష్టాలలో ఉంటే త్వరగా స్పందించేవారుగా ఉంటారు.
ఆరోగ్యం: కుంభరాశికి చెందినవారు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ ఒకింత తట్టుకుని నిలబడగడిగే శక్తి ఉంటుంది. సాధారణంగా జ్వరంవంటి చిన్నచిన్న సమస్యలు తప్ప పెద్దపెద్ద అనారోగ్య సమస్యలు వీరి దరిచేరవు. అయితే కొన్నిసార్లు ఆరోగ్యంపట్ల అశ్రద్ద ప్రదర్శించటంవల్ల అనారోగ్యం చుట్టుముడుతుంది. సహజంగా ఉదర సంబంధిత వ్యాధులు మాత్రమే వీరిని బాధిస్తాయి. రక్తహీనత మూలంగా కొన్ని అనారోగ్యాలు వీరిని ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది.