మకరరాశివారి శరీరం ఆరోగ్యం,ఆదాయం అదృష్టం,లక్షణాలు,గుణగణాలు, ప్రేమ,దాంపత్య జీవితం,కుటుంబం,బలహీనతలు,విద్య,ఉద్యోగం, వ్యాపారం..!!
ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణా 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ఠ 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశి కి చెందుతారు.
రాశి చక్రంలో మకరరాశి పదవది. ఈ రాశికి అధిపతి శని. మకరరాశిని చర రాశి, భూతత్వ రాశి అని అంటారు. మొసలి శరీరాన్ని కలిగి, జింక మొహాన్ని కలిగిన చిత్రం అయినటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడింది.
ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు ఏదైనా ఒక విషయంపట్ల పట్టుపడితే దాన్ని వదిలిపెట్టరు. ఎలాగైతే మొసలి గట్టి పట్టు పడుతుందో, అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాని అంతు చూసేవరకూ వదిలిపెట్టరు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనస్సు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. ఈ రాశివారు జీవితములో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని స్వంతము చేసుకుంటారు.
మకరరాశివారికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడము వీరి స్వభావము మరియు బలహీనత. పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారి తీస్తుంది. తన లోపము తెలిసిన తరువాత తమ తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. చేసిన పొరపాటు తిరిగి చెయ్యరు.
మకరరాశివారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించేవారిని ప్రేమించేవారిని సమానంగా చూస్తారు. కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా పద్ధతి మార్చుకోరు. మకరరాశివారికి సాత్విక స్వభావము. మాటమీద నిలబడే తత్వము ఉంటాయి.
మకరరాశివారికి స్త్రీ సంతానముపట్ల అభిమానము అధికముగా ఉంటుంది. సంతానము వీరి అభీష్టము ప్రకారము నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికముగా శ్రమిస్తారు. చిన్నతనమునుండి అధికముగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు.
మకరరాశివారికీ పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము అధికముగా ఉంటుంది. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారము కలవారై ఉంటారు. రచనా వ్యాపకము, పరిశోధనా, నటన, కళా సంబంధమైన నైపుణ్యము విశేషముగా ఉంటుంది.
మకరరాశివారి మేధస్సు, శ్రమ ఇతరులచేత దోచుకొనబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడము కష్టము. ధన సంపాదనే ధ్యేయముగా జీవించరు. ఎదో విధముగా ధనము సర్ధుబాటు అయి అవసరాలు గడిచి పొతాయి. అభిమానించే నమ్మిన అనుచర వర్గము వెంట ఉంటారు. కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు.
మకరరాశివారికి స్త్రీలవలన అదృష్టము కలసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్నచిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు. చాలామందికి తండ్రివలన మేలు జరగదు. ప్రజాభిమానముతో ఊన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహము అధికముగా ఉంటుంది. బంధువర్గము కంటే బయటివారి సహాయము అధికముగా అందుతుంది.
మకరరాశివారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు. వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు. భోజనప్రియులు అని చెప్పవచ్చు. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభనష్టాలను బేరీజు వేసుకొని, లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు.
మకరరాశివారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు. తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తరువాత, మిగతా విషయాలను మాట్లాడుతారు. తమకు ఏదైనా పనిచేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే, ప్రయోజనాన్ని ఆశించిన తరువాతనే, ఆ పనిని మొదలు పెడతారు.
ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవటం మకరరాశి వారికి నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయముల మీదనే వీళ్లకు విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలను అస్సలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు. చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే, దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగించేస్తారు.
మకరరాశిలో జన్మించినవారికి గట్టి పట్టుదల,జాగ్రత్త, అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఇలాంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి. అందువలన వీరు జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది.
మకరరాశివారు అర్థంకాని ఏ విషయాన్ని అంగీకరించరు. దేనినైనా సూక్ష్మపరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మకరరాశివారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు.
మకరరాశివారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింకపిల్లవంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు.
మకరరాశివారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు. కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాలలో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు.
మకరరాశివారు ప్రయత్నమున మనసుపెట్టి ఏ పని చేసినా, దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటివారిని మించి పోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారుగానూ, క్రూరులుగాను కనిపిస్తారు. కానీ వీళ్ళ లో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. మకరరాశివారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందెవేసిన చెయ్యి. వీళ్ళ తరవాతే ఎవరైనా అని చెప్పవచ్చు.
మకరరాశిలో జన్మించినవారి జీవితం అంతా కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. వీరికి 30 సంవత్సరాలవరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయస్సు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా, జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి, సొంత ఇల్లు కూడా ఉంటుంది.
మకరరాశివారికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్లకు ఉన్న సంకల్పసిద్ధి అద్భుతమని చెప్పవచ్చు. ఎన్ని విఘ్నాలు కలిగిన తమ అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనగా వీరు ఓటమిని అంగీకరించరు.
మకరరాశివారు ఇతరులలో ఉన్న తప్పులను ఇట్టే పట్టేస్తారు. ఎవరిని నమ్మరు. ఆఖరికి మంచివారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవీవ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది.
మకరరాశివారు అనేక విషయాలలో అంచనాలు చక్కగా పొరబాట్లు లేకుండా వేస్తారు. ఊహలు నిజము ఔతాయి. శని, శుక్ర, బుధదశలు యొగిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలలో అంకిత భావముతో ఉంటారు. సామాజిక సేవ, సామాజిక న్యాయము దైవముగా భావిస్తారు.
శరీరం & ఆరోగ్యం: ఈ రాశివారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటివాటిపై ఆసక్తి ఎక్కువ. వస్త్రధారణలోను తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు. వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది.
ఆర్థిక స్థితి: ఈ రాశికి చెందినవారు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకునేందుకు అన్నివిధాలా కృషిచేస్తారు. ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గాలలో విజయం సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు.
ఆదాయం మరియు అదృష్టం: మకరరాశికి చెందినవారు కార్యసాధకులుగా ఉంటారు. వీరు కళాకారులుగా, రాజనీతి శాస్త్రజ్ఞులుగా, రాజకీయనాయకులుగా మంచిపేరు తెచ్చుకుంటారు. జీవితంపై ఓ ప్రత్యేక దృష్టి వుండటంవల్ల వీరి జీవితం ఎటుంవంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది.
ప్రేమ సంబంధం: మకరరాశివారి జాతకరీత్యా వీరిలో ప్రేమ స్వభావం ప్రబలమైనదిగా ఉంటుంది. తమకు నచ్చిన గుణాలు కలిగినవారు తారసపడితే వెంటనే వారికి ఆకర్షితులవుతారు. అయితే వీరిది నిష్కల్మషమైన ప్రేమ.
వ్యాపారం: మకరరాశికి చెందినవారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. ఈ రంగంలో అడుగుపెట్టిన వీరికి దాదాపు ఎదురే ఉండదు. మోటారు పరిశ్రమ కూడా వీరికి కలిసివస్తుంది. ఇక పెద్ద పరిశ్రమలు స్థాపించటం వీరికే సాధ్యమవుతుందని చెప్పవచ్చు.
గుణగణాలు: మకరరాశికి చెందినవారు ఆశావాదులుగానూ, ఆచరణశీలిగానూ, దృఢనిశ్చయం కలవారై ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ విజయం సాధించేవారుగా ఉంటారు. దీనికి ఓర్పు, అప్రమత్తత, కష్టపడి పనిచేయటంవంటి గుణాలు తోడవటంతో విజయం సుగమమవుతుంది. భవిష్యత్ ప్రణాళికల విషయంలో దూరదృష్టితో వ్యవహరిస్తారు. సంబంధాలను ఏర్పరచుకోవటంలోనూ ఇదే మార్గాన్ని అనుసరిస్తారు.
దాంపత్య జీవితం: అనుకూల దాంపత్యంతో మకరరాశివారు తమ వైవాహిక జీవితాన్ని సాగిస్తారు. తమ భాగస్వాముల విషయంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సర్దుకుపోతారు. అయితే కొన్నిసార్లు ఇతరుల విషయానికి సంబంధించి చిన్నచిన్న వివాదాలు చెలరేగుతాయి.
విద్య: మకరరాశికి చెందినవారు జ్ఞానవంతులుగా ఉంటారు. దీనివల్ల వీరు ఎక్కువగా అధ్యాపక వృత్తిలో కొనసాగుతారు. ఇక విద్యార్థుల చదువు విషయానికి వస్తే న్యాయవాదం, సంగీతం తదితర వృత్తులకు సంబంధించిన చదువులలో కొనసాగుతారు.
గృహం మరియు కుటుంబం: మకరరాశికి చెందినవారు తమ కుటుంబంపట్ల అత్యంత కఠిన స్వభావులుగా ఉంటారు. అన్నింటా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను పాటించాలని సూచిస్తుంటారు. ఈ గుణంవల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తినా, వారి క్రమశిక్షణవల్ల కుటుంబం వృద్ధిలోకి వస్తుంది.
సహజమైన బలహీనతలు: మకరరాశివారిలో ప్రధాన బలహీనత నిరాశావాదం. వారి ఆలోచనలో నిరాశ తొంగిచూస్తుంటుంది. అదే సమయంలో ఏదైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోరు.
వ్యక్తిత్వం: చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండటంవల్ల వీరి మనస్సు క్షణక్షణానికి మారుతుంటుంది. ఈ చంచల స్వభావంవల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు. అయితే కొన్ని ప్రత్యేక కారణాలవల్ల వీరు స్థిరచిత్తులుగా మారక తప్పదు. ఇక అప్పట్నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది.
ఆరోగ్యం: మకరరాశికి చెందినవారు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. అయితే వారిని వాత, అజీర్ణ వ్యాధులు వేధిస్తాయి. అలాగే ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు అతి జాగ్రత్తలు తీసుకోవటంవల్ల వీరిని అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరవు.