Loading...
loading

మిధునరాశివారి లక్షణాలు, గుణగణాలు

  • Home
  • Blog
  • మిధునరాశివారి లక్షణాలు, గుణగణాలు

మిధునరాశివారి లక్షణాలు, గుణగణాలు

మిధునరాశివారి శరీరం ఆరోగ్యం, ఆదాయం అదృష్టం, లక్షణాలు, గుణగణాలు, ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబం, బలహీనతలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం..!!

మృగశిర 3,4 పాదములు, ఆరుద్ర 1,2,3,4 పాదములు, మరియు పునర్వసు 1, 2,3 పాదములలో జన్మించినవారు మిథునరాశికి చెందుతారు.

మిధునరాశి యొక్క గ్రహాదిపతి బుధుడు.  మిధునరాశి జ్యోతిషచక్రంలో మూడవరాశి.  దంపతులు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడియున్నది.   ఈ రాశి ద్విస్వభావరాశి మరియు వాయుతత్వరాశి.  సన్నని పాదాలు, నిశితమైన దృష్టి కలిగి ఉంటారు. వీళ్ళు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఈ రాశివారు ఇతరులు అభిప్రాయానికితగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు.

మిధునరాశివారు బాల్యమునుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు. జీవితానుభవము, అనేకరంగాల గురించి అవగాహన చిన్నతనమునుండి అలవడుతుంది. వివాహము, సంతానప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచి పోతుంది. జీవితములో పని చేయించుకుని ప్రత్యుపకారము చేయనివారివలన ఇబ్బందులు ఎదురౌతాయి. వంశపారంపర్యముగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలసిరాదు. ఇతరుల సొమ్ముమీద, ఆస్తిమీద ఆసక్తి ఉండదు. స్వార్జితము మీదే అధికముగా దృష్టి సారిస్తారు. 

మిథునరాశివారు చక్కని శారీరక నిర్మాణం, వయస్సు కనిపించనీయని యువకళ  కలిగి వుంటారు. వార్ధక్యము వచ్చువరకు వీరు వయస్సులో చిన్నవారివలే కనిపిస్తూ వుంటారు. వీరు పొడవుగా, నిటారైన దేహం, ఆజానుబాహు తత్వం కలిగి వుంటారు. 

ఆదర్శముగా ఉండే వీరి భావాలు పలువురుకి అయిష్టత కలిగిస్తుంది. అవకాశాలను సద్వినియోగము చేసుకునే సామర్థ్యము కలిగి వుంటారు. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. జీవితములో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు. తాను పడిన కష్టాలు ఇతరులు పదకూడదని భావిస్తారు.

శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయము వచ్చినప్పుడు మాత్రము ప్రతీకారము తీర్చుకోరు. సంతానముతో చక్కని అనుబంధము ఉన్నా తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నము మాత్రము చేయరు.  ప్రభుత్వపరముగా, చట్టపరముగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్ధము చేసుకుంటారు.

చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు. అన్ని లెక్కలు వ్రాత పుర్వకముగా లేకున్నా చక్కగా గుర్తు ఉంటుంది. వివాదాలకు దూరముగా ఉంటారు. కాని సమస్యలకు దూరముగా పారిపోరు. ప్రతిఘటించే తత్వము అధికముగా ఉంటుంది. వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడములో శ్రద్ధ వహిస్తారు.

మిథునరాశివారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరినీ నొప్పించకుండా తమతమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తారు. వీరికి కళలపై ఆసక్తి ఉంటుంది.  

మిథునరాశివారు అల్పసంతోషి అని వీరిని చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు.  తమ మాటలతో ఇతరులను సంతోష పరుస్తారు.  చక్కని వాగ్ధాటి ఉంటుంది.  అవసరమైతే తనని నమ్మినవారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది.

మిథునరాశివారికి చంచల స్వభావం ఉంటుంది.  అదే సమయంలో ప్రతిపనిలో విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది.  ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచిచెడులను బేరీజు వేసుకుని కానీ ప్రారంభించరు.  వీరికున్న చంచల స్వభావం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు.

మిథునరాశివారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు.  అదే విధంగా వీరు హాస్యప్రియులు.  తమది  అనుకున్నదాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమశైలిలో పరిష్కరిస్తారు.  వీళ్ళయొక్క ఉజ్వల భవిష్యత్తుకొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ వుంటారు. ఏ విషయాన్ని ఐనా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్లలో చాలామంది ఉన్నత స్థానాల్లో వుంటారు.

మిధునరాశివారు, వివాదాలకు దూరంగా ఉంటారు.  కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పక పోరాడుతారు.  వీరిలో ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది. తమ వృత్తివ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు.

తమ జీవితంలో రెండురకాల వృత్తిఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం. వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్యకంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువులవలన ఇబ్బందులు పడతారు.  ఎప్పుడు చూసినా తనగతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా గతాన్ని ఆలోచించుకుంటూ ఉన్నతస్థితికి వస్తారు.

మిథునరాశివారు అనవసర విషయములు గురించి ఎక్కువగా ఆలోచించుటవలన మానసిక వ్యధ, నిద్రపట్టకపోవడంలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. మిధునరాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు.  అందువలన ఈ రాశివారు వేరొకవారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు.

మిధునరాశివారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్ట నీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి,  ఇతరులగుట్టు సులభముగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచిమార్గంలో  శిక్షణ ఇస్తారు. కానీ వీరు మాత్రం చిరకాలం ఎవ్వరినీ నమ్మరు.

ఇక వ్యాపారానికి విషయానికి వస్తే, వృత్తి మార్పిడిలు చేసి, రకరకాల వ్యాపారములుచేసి వీరు మంచి లాభాలు గడిస్తారు. రెండుపక్షముల నడుచు వ్యవహారములను చక్కదిద్దుటకు వీరు తమ చాతుర్యముతో సరిదిద్దుతారు.

మిథునరాశివారు న్యాయవాదవృత్తి, వార్తాప్రసార వృత్తి,  తంతితపాలా శాఖలు, ముద్రణాలయానికి సంబంధించిన వృత్తులుయందు బాగా రాణిస్తారు. గ్రంథరచన చేయుట, అనువాదము చేయుట, పత్రికలలో రచనలు చేయుటయందు వీరు నేర్పరులు. సెక్రెటరీ, రాయభారము, దౌత్యం వృత్తులలో కూడా వీరు బాగా రాణిస్తారు.

మిథునరాశివారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందువలన వీరికి ధనము గురించి చింత, భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటుంది.

మిధునరాశివారికి స్త్రీపురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒక్కరితోనూ వివాహము మరిఒక్కరితోనూ వీరి జీవితంలో జరగవచ్చును. అయినప్పటికీ  ఇటువంటి విషయాలు  ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహముతో పాటుగా ఐశ్వర్యము కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు. మిథునరాశి వారికీ నిజమైన, వాస్తవమైన సుఖశాంతులు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి, హృదయమును సమర్పించుట జరగవలెను.

మిథునరాశివారికి ఎదుటివారినిబట్టి స్వభావమును మార్చు కొనుట వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకొనుటలో, మంచిచెడ్డలను విమర్శించుటలో వీరికి వీరే సాటి. మిధునరాశివారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్ధ్యములను అర్థవంతంగా వినియోగించగలరు. ఈ రాశి వారికి పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరచుట యందు చక్కటి నైపుణ్యం ఉంటుంది. వ్యక్తులకు సహాయం చేయటంకన్నా సంస్థలకు సహాయం చేయటపై వీరికి విశ్వాసం ఎక్కువ. శుక్రదశ, శనిదశ యోగవంతమైన కాలము. ఈ దశలలో మంచి ఫలితాలు సాధిస్తారు.

ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళానైపుణ్యము ఉంటుంది. సంగీతమునందు మంచి నైపుణ్యం ఉంటుంది. వీణ లాంటి వాయిద్యములలో మంచి నైపుణ్యం ఉంటుంది. అలాగే శిల్పకళ,  చిత్రలేఖనము, కుట్టుపని, అల్లికపని, గృహోపకరణాల అలంకరణములయందు చక్కటి ప్రావీణ్యం ఉంటుంది. అలాగే పూలమొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుటలో ప్రత్యేక కౌశలం కూడా ఉంటుంది.

శరీరం & ఆరోగ్యం: మిధునరాశికి చెందినవారు తేజోవంతులుగానూ, సౌందర్యవంతులుగానూ ఉంటారు. ప్రతి విషయంలోనూ సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడూ నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరితో కలిసిపోయేవారుగా ఉంటారు.

ఆర్థిక స్థితి: ఈ రాశివారు ధనవంతులుగా ఉంటారు. ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతారు.

ఆదాయం మరియు అదృష్టం: మిధునరాశికి చెందినవారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తారు. ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలనే ఇందుకు ఎంచుకుంటారు. పాత్రికేయ వృత్తితోపాటు సంబంధిత మీడియాలో అగ్రస్థాయిని చేరుకుంటారు.

ప్రేమ సంబంధం: మిధునరాశికి చెందినవారి జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుని ఉంటుంది. వీరు ఎవరిపట్లయినా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు. తాము ప్రేమించినవారు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటుంటే వీరు దానిని తమ కష్టంగా భావించి తమవంతు సాయం అందిస్తారు.

వ్యాపారం: ఈ రాశికి చెందినవారు వ్యాపార వ్యవహారాలలో చురుకుగా ఉంటారు. అభివృద్ధిని సాధిస్తారు. సిమెంటు, భవన నిర్మాణ రంగాలు వీరికి కలిసి వస్తాయి.

గుణగణాలు: మిధున రాశికి చెందినవారు నిదానస్తులుగానూ, నిశ్శబ్ధంగా తమ పనులు చేసుకుపోయే వారుగానూ ఉంటారు. వీరి జీవన విధానం హుందాగాను, అందరిని ఆకట్టుకునే రీతిలో, అనేక విషయాలలో పాండిత్యం కలిగి, కలివిడిగా ఉంటారు. నిరంతరం అందరితో కలిసిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ రాశి వారు కొత్తదనాన్ని ఆహ్వానిస్తారు. సంప్రదింపులలో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు. సమయానుకూలంగా మనస్సును మార్చుకుంటారు.

దాంపత్య జీవితం: మిధున రాశికి చెందిన వారు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. వీరిని భాగస్వాములు తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు. అదేవిధంగా తమ భాగస్వామి చెప్పిన మాటకు విలువివ్వటమే దీనికి కారణం. వీరివద్ద నుంచి ఏదైనా సాధించుకోవటం చాలా తేలికైన పని.

విద్య: వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళుతుంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలం అవుతాయి. ఏదిఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం.

గృహం మరియు కుటుంబం: వీరు ఇతరులను కూడా తమ కుటుంబ సభ్యల లెక్కలో చూస్తుంటారు. ఇది కుటుంబ సభ్యుల కోపానికి దారితీస్తుంది. అయినా వారు ఈ విషయాన్ని పట్టించుకోరు. కుటుంబ సభ్యలకు ఎలాగైతే చేదోడు వాదోడుగా ఉంటారో అదేవిధంగా ఇతరుల పట్ల వ్యవహరిస్తారు.

సహజమైన బలహీనతలు: మిధున రాశికి చెందినవారు నిలకడగాలేని మనస్తత్వం కలిగి ఉంటారు. అదేవిధంగా కాస్తంత మోసకారి మాటలు కూడా వెలుగు చూస్తాయి. ఈ రెండు లక్షణాలు వీరిలోని ప్రధాన బలహీనతలు. ఈ లక్షణాల వల్ల కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు వీరికి అందకుండా పోతాయి.

వ్యక్తిత్వం: మిధున రాశికి చెందినవారు సర్వుల అభిప్రాయాలను అంగీకరించే స్వభావం కలవారుగా ఉంటారు. ఎటువంటి గందరగోళం లేకుండా నిశ్శబ్దంగా అనుకున్నదానిని సాధించేవారుగా ఉంటారు. చంచల స్వభావం కలిగిన మిథున రాశి వారి మెప్పును పొందటం చాలా సులభం. అయితే ఇదే కారణంతో వారికి దూరం అయ్యే అవకాశం లేకపోలేదు.

ఆరోగ్యం: మిధున రాశి వారు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. ముఖ్యంగా వ్యాయామం చేయని వారు కావటంతో వీరికి అనారోగ్య సమస్యలు తేలికగా వస్తాయి. జ్వరం దగ్గర్నుంచి మొదలై పెద్ద పెద్ద సమస్యలుగా మారతాయి. ఎందుకంటే వీరికి ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ ఉండుదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

X