మీనరాశివారి శరీరం ఆరోగ్యం,ఆదాయం అదృష్టం,లక్షణాలు,గుణగణాలు, ప్రేమ,దాంపత్య జీవితం,కుటుంబం,బలహీనతలు,విద్య,ఉద్యోగం, వ్యాపారం..!!
పూర్వాభాద్ర 4వ పాదము,ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు మరియు రేవతి 1,2,3,4 పాదములులో జన్మించినవారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరిది.
మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వం రాశి అని పిలుస్తారు. రెండు చేపలు ఒక దాని తోక వైపునకు మరియొక దాని తల ఉన్నట్లు, ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాలలో చెప్పబడినది.
మీనరాశివారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనముతో ఆస్తులు ధనం సంపాదిస్తారు. మంచి ఆశయముకొరకు, మంచివారి సాంగత్యంకొరకు భాగస్వామ్యంకొరకు ఎదురు చూస్తారు. ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యముతో మంచి ఫలితాలు సాధించే సమయములో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తులవలన విఘాతము కలుగుతుంది.
మీనరాశివారు ఆచార వ్యవహారాలు,తత్వ,వేదాంత, జ్యోతిష,హోమియోపతి,గణితం మొదలైనవాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు. వీరికిగల సంగీతాభిమాం, క్రీడాభిమానం జీవితములో మంచి మలుపుకు దారి తీస్తాయి. ఇతరుల మాయమాటల ప్రభావం చాలాకాలం వీరిమీద ప్రభావం చూపిస్తుంది. తమకంటూ స్వంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు. వంశ గౌరవం, మంచితనం చాలావరకు ఆదుకుంటుంది.
మీనరాశివారు ఎక్కువగా నీళ్ళు తాగుతుంటారు. స్థానాభిలాష కలిగి ఉంటారు. ఉన్నతస్థానాలలో బంధువులను కలిగి ఉంటారు. వారి సహాయ సహకారాలు నామమాత్రముగా ఉన్నా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. విద్యారంగలో సాధన ఆరోగ్యముమీద ఆధారపడి ఉంటుంది.
మీనరాశివారికి కళా సాహిత్యరంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది. వంశ పారంపర్యముగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు. కాని ఆస్తులు దక్కడం అనుమానాస్పదం. బంధువర్గము తండ్రిని మోసగించి నష్టపరుస్తారు.
మీనరాశివారికి అన్యభాషలకు సంబంధించిన విషయాలు, విదేశీ వ్యవహారాలు కలసి వస్తాయి. ఎవరిని ఏ పనికి నియమించాలో బేరీజు వేయడములో చాలావరకు పొరబాటు పడతారు. ధనవంతులైన స్నేహితులు ఆదుకూంటారు. సభానిర్వహణ, సాంస్కృతిక కార్యనిర్వహణలో సామర్ధ్యము కలిగి ఉంటారు.
మీనరాశివారికి ప్రచార సాధనాలు, మీడియాతో జీవితంలో ముఖ్యవిషయాలు ముడిపడి ఉంటాయి. స్వంతవారు, బంధువర్గం లేక కులానికి చెందిన ఒక వ్యక్తివలన అనేక సమస్యలను ఎదుర్కొంటారు. వీరు మనుష్యుల మనోభావాలను సులభంగా చదువగలరు.
మీనరాశివారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు. ప్రకృతికి సహజత్వానికి సమీపముగా జీవితం గడపాలన్న వీరి ఆశ నెరవేరుతుంది. ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు. వీరితో ఉన్న అవసరాలవలన బంధువులు, స్నేహితులు దగ్గరైనా అవసరాలు తీరిన తరువాతకూడా సంబంధాలు కొనసాగుతాయి.
మీనరాశివారికి ఆర్థిక ప్రయోజనాలు,ఆశించిన గుర్తింపు రావడం కష్టమే. రావలసిన ప్రయోజనాలు ఏదో కారణంవలన నిలిచి పోతాయి. ఆర్థిక స్థిరత్వ పోరాటంవలన కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు. ముఖ్య విషయాల మీద దృష్తి సారించడం, అధికమైన ఆశ లేక పొవడంవలన మానసిక ప్రశాంతత, విజయము లభిస్తుంది.
మీనరాశివారు వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటారు. కాని స్వంతవారివలన గొడవలు, ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు. సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అనర్ధమౌతుంది. భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. ఆలస్యముగా అయినా అదృష్టం వరిస్తుంది.
మీనరాశివారు స్వసిద్ధముగా చాలా మంచివారు. ఏ విషయాన్నికూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవటం వీరికి చేతకాదని చెప్పవచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టటం, కుట్రలు చెయ్యటం వీరికి చేతకాదు.
మీనరాశివారు చూడటానికి ఆవేశపరులుగా కనిపిస్తారు. కాని వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైన అయినా కోపంవస్తే వారిలోవారే బాధపడతారు. కానీ వారిమీద కక్ష తీర్చుకోరు. దుష్టులునుకూడా మంచివారిగా మార్చటానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము.
మీనరాశివారికి చేతులు,పాదాలు పుష్టికరంగా వుంటాయి. మెత్తని అందమైన తలవెంట్రుకలను కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలలో ఉండదు. చాలా భయపడుతూ ఉంటారు.
మీనరాశివారికి కవిత రచన అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో పని చేస్తూ, ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలంటే వీరికి ఎవరైనా తోడు ఉండాల్సిందే. వీరు ఒక్కరూ స్వతంత్రంగా ఏ పని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసేవరకు వీరికి నమ్మకం ఉండదు.
మీనరాశివారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలని ఆలోచన ఎంతగా ఉంటుందో, అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాన్ని తీసుకుంటారు.
మీనరాశివారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్ధవంతంగా నిర్వహించ లేరు. తొందరగా అలసిపోయేవంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారిపై స్త్రీల ప్రభావము ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమురాలు ఐతే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది.
మీనరాశివారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. వీరు కుటుంబసభ్యులకు అన్నిరకాల ఆనందాన్ని ఇవ్వగలరు. మీనరాశివారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. వీరు తమ జీవిత భాగస్వామి, పిల్లలుపట్ల చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని చూపిస్తారు.
మీనరాశివారు అనేక విషయాలలో మానసిక ఆందోళన చెందుతుంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులు ఎక్కువగా, తొందరగా చేయడంవల్ల అలసిపోతుంటారు.
సాధారణంగా మీనరాశిలో జన్మించినవారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే, అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకొను సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.
మీనరాశివారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తిఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. ఐనా ముఖ్య విషయం ఏమంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు.
వీరికి కళ,సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి, నిపుణత ఉంటుంది. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలాకాలం చూపిస్తుంది. నిధానం అవసరమని నిదానంగా వీళ్లు గ్రహిస్తారు.
మీనరాశివారిని వంశ గౌరవం, మంచితనం చాలావరకు ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్దరిస్తారని చాలాకాలంపాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీనరాశివారు సామర్థ్యంలేని మనుషులను ప్రోత్సహించడంవల్ల వీరియొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు.
మీనరాశివారికి గురు,శుక్ర,శని దశలు బాగా యోగిస్తాయి. సుదర్శన కవచ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.
శరీరం & ఆరోగ్యం : ప్రతిఒక్కరినీ కలుపుపోయే అలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది.
ఆర్థిక స్థితి : మీనరాశివారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు. ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాలలో తెలివిగా సంపాదిస్తారు. స్థిరమైన వ్యాపారాలపట్ల వీరు దృష్టి పెట్టరు. కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చు.
ఆదాయం మరియు అదృష్టం : మీనరాశికి చెందినవారు కళలకు సంబంధించిన వృత్తులలో రాణిస్తారు. నృత్యం, సంగీతం,సాహిత్యంవంటి ఇతర కళారంగాలలో వీరు ఉన్నతులుగా ఉంటారు.
ప్రేమ సంబంధం : దయ,జాలి,గ్రహణశీలి, స్వీకరించే తత్వంగల మీనరాశికి చెందినవారితో పరిచయం ఏర్పరచుకోవటం చాలా తేలిక. అయితే వారు కాస్త పిరికివారు కావటంతో మీనుంచి కొంత సహాయం అవసరమవుతుంది. వారికి సంబంధించిన విషయాలన్నీ అత్యంత కళాదృష్టితో రూపొందించుకుంటారు
వ్యాపారం: వీరు మొదటినుంచి కష్టపడే తత్వంగలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి,వ్యాపారం విషయంలో ఒకటిరెండుసార్లు ఆలోచించి అడుగువేస్తారు. దీనివల్ల వీరికి ఆర్ధికంగా లాభాలు కురిపిస్తాయి.
గుణగణాలు : నమ్రతతో కూడిన వ్యక్తిత్వంగల గుణాన్ని చూసి వారు మీనరాశికి చెందినవారని మీరు ఇట్టే గుర్తిస్తారు. ఆధ్యాత్మిక మార్గంపై ఇష్టతను కలిగి ఉండటమేకాక, ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు. ఈ మార్గం వారిని కపటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది. ఉన్నత శిఖరాలకు తీసుకవెళుతుంది.
దాంపత్య జీవితం: మీనరాశికి చెందినవారి వైవాహిక జీవితం కాస్తంత ఒడిదుడుకులతో సాగినప్పటికీ, ఆ తర్వాత సర్దుకుంటుంది. వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగటానికి ఇరువర్గాల బంధువులు సహకారం అవసరమవుతుంది.
విద్య : వీరు సాంకేతికవిద్యలో రాణిస్తారు. అలాగే జీవనగమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళుతుంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలం అవుతాయి. ఏదిఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం.
గృహం మరియు కుటుంబం : మీనరాశికి చెందినవారు తమ కుటుంబ బాధ్యతలను పూర్తిస్థాయిలో తమపై వేసుకుంటారు. ఫలితంగా ఇంటా బయటా అందరి మన్ననలు పొందగలుగుతారు.
సహజమైన బలహీనతలు : అస్పష్ట,నిస్సహాయ, గందరగోళం,అవిశ్వసనీయ,తప్పించుకొనేటువంటి బలహీన గుణాలు కలిగిన వీరు, కొన్ని సందర్భాలలో చాలా తేలికగా ఉన్నవాటిని కొన్ని కోల్పోతారు.
వ్యక్తిత్వం : ఈ రాశికి చెందినవారిలో ఉన్న చాలా మంచి గుణాలు, గందరగోళం,మూఢ విశ్వాసం,ఆదర్శవాదాల ముసుగులో కప్పబడి ఉంటాయి. అందువల్ల వీరి వ్యక్తిత్వం ఎదుటివారికి అంత స్పష్టంగా గోచరించదు.
ఆరోగ్యం : మీనరాశికి చెందినవారు ఆరోగ్యంపై శ్రద్ధగా ఉన్నప్పటికీ వారిని ఉదరకోశ జబ్బులు వెంటాడతాయి. దీనికి కచ్చితమైన చికిత్సలు తీసుకోవటంద్వారా ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంకా శారీరక సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఆరోగ్యంపట్ల అత్యంత జాగ్రత్తగా ఉండటం అవసరం.