మేషరాశివారి శరీరం ఆరోగ్యం, ఆదాయం అదృష్టం, లక్షణాలు, గుణగణాలు, ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబం, బలహీనతలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం..!!
అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు కృత్తికా నక్షత్రం 1 వ పాదములో జన్మించినవారు మేషరాశికి చెందుతారు.
మేషరాశివారి చిహ్నము గొర్రె. మేషరాశివారి అధిపతి కుజుడు. కావున ఈ రాశివారు శాస్త్రవిద్య సాంకేతికవిద్య యుద్ధవిద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్తపరికరాలను తయారుచేయడంలో ఆరితేరి ఉంటారు. భారీవాహనాలను నడపటం యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలను నడపటం యుద్ధవిమాన పైలెట్లుగాను అణుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నిటిలోనూ నిష్ణాతులుగా చెప్పవచ్చు.
మేషరాశివారి జీవితములో ఒడిదుడుకులు ఎక్కువ. అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. బాల్యములో కష్టాలు అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురౌతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే అవగతమౌతుంది.
మేషరాశివారు స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురి ఔతారు. సాహస క్రీదల పట్ల అభిమానము మెండు. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. భాగస్వాములతొ కలిగే విభేదాలు జీవితములో మలుపును తెస్తాయి.
మేషరాశివారికీ మనోధైర్యముతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండ చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. వైద్యరంగములో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడనికి ఇష్టపడరు. సొమరితనమంటే అయిష్టము.
మేషరాశివారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితములో రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు ప్రతిష్తకు భంగము లేదు. స్త్రీలకు సంతానము, జీవిత భాగస్వామి విషయములో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసి పోతాయి. జ్యేష్ట సంతానము విషయములో జాగ్రత్త వహించాలి.
మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోవు స్వభావము ఉంటుంది. ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును. వీరి శరీరము చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యము వీళ్ళకి ఉంటుంది. వీళ్లకు ఉన్నటువంటి వాగ్ధాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహా కార్యములు కూడా సాధించగలరు.
మేషరాశివారిది దయార్థ హృదయము. వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం గానీ చూపిస్తారు. అయితే వీరు ఇతరులను ఎంత గాఢముగా ప్రేమిస్తారో, ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధ పడతారు. దీని వలన వీళ్ళకి అనారోగ్యం, మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది.
మేషరాశివారికి తమ వివాహజీవితంలో క్రమశిక్షణ, వివేకము చాలా అవసరము. అలాకాకుండా ఆవేశముతో తీసుకున్న నిర్ణయంవలన జీవితాంతము బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది.
మేషరాశివారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం, అలవరచుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. మేషరాశి వారికి ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు.
మేషరాశివారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశము, ఎక్కువగా ఉంటాయి. ఆకారణమైన ఆవేశం వలన వీరు ఆత్మీయులను ఎక్కువగా నష్ట పోతుంటారు. తమ తొందరపాటుతనం తో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు. అలాగే కొన్ని అనవసర వ్యవహారాలలో చిక్కుకు పోతారు.
మేషరాశివారిని నమ్మినవారు మోసం చేయడంవల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు. వీరి జాతకంలో నమ్మకద్రోహులవలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కావున వీరు జాగ్రత్తగా ఉండాలి.
మేషరాశివారు తొందరగా పదవులు పొందగలరు. తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలరు. తొందరగా పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే ఈ రాశివారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది. నిమిషనిమిషానికి వీరి ఆలోచనలను మార్చుకుంటారు.
శరీరం & ఆరోగ్యం: ఈ రాశివారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటివాటిపై ఆసక్తి ఎక్కువ. వస్త్ర ధారణలోను తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు. వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది.
ఆర్థిక స్థితి: మేషరాశికి చెందినవారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు. దీనికి కారణం వారి శ్రమ, పట్టుదలే. అత్యంత చతురత మనస్తత్వం కలిగిన వారు కావటంతో ఎక్కడికి వెళ్లినా అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు. వీరి బుద్ధి కుశలతే వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు.
ఆదాయం మరియు అదృష్టం : మేషరాశిలో జన్మించినవారు జీవితంలో ఉన్నత వ్యక్తులగానో, ప్రముఖలు గానో చెలామణి అవుతారు. దీనికి కారణం ఈ రాశిపై మంగళ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు రాజకీయాలలో కీలకపాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు. రాజకీయ నేతలుగా ఎదగటంవల్ల వీరిపై ప్రజలలో ఎనలేని మమకారం ఉంటుంది. ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవటానికి వీరు సంశయించరు.
ప్రేమ సంబంధం: మేషరాశివారు తాము ప్రేమించిన వారిని ఎన్నడూ వదిలివేయరు. పెళ్లి పీటల దాకా వెళతారు. కళ్యాణం చేసుకుంటారు. ఇష్ట పడినవారి కోసం పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం ఉంటుంది. ఈ రాశివారు ఉత్సాహవంతులుగా ఉంటారు. ఒక్కొక్కసారి ప్రేమే వీరిపాలిట శాపంగా మారుతుంది. ఆంటే ప్రేమవల్ల బాధపడాల్సి ఉంటుంది.
రాణించే వృత్తులు: మేషరాశివారు జన్మత నాయకులు వీరు పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖలలో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు వస్తుసామాగ్రి శస్త్రచికిత్స పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశివారు రాజకీయాలనందు సమర్థులైన వ్యవహరించగలరు. వీరికున్న ప్రజ్ఞ పాటవంవలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అరుదైన సందర్భాలలో దీనివలన వీరికి ప్రాణహాని కూడా కలుగును. ఈ రాశి వారు క్రీడలనందు కూడా రాణిస్తారు. వీరికి చక్కని దర్శనజ్ఞానం ఉంటుంది.
వ్యాపారం: మేషరాశికి చెందినవారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగి వాటిని అవసర సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు. సిమెంటు, ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మేషరాశివారు రాణిస్తారు. వీటితోపాటు సూపర్ మార్కెట్లు ప్రారంభించినా లాభాలను సాధిస్తారు. మొత్తంమీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు.
గుణగణాలు: మేషరాశి చెందినవారు స్వేచ్ఛా ప్రియులుగాను, స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు. వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. ధైర్యం, విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు. వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునే వారై ఉంటారు. ఎవరైనా రెచ్చ గొడితే పనులు అర్దాంతంగా వదిలిపోయేవారయి, సహనంలేని వారుగానూ ఉంటారు.
దాంపత్య జీవితం: మేష రాశి వారిపై సూర్యుడు, మంగళ, శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండంటంవల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటారు. ఈ రాశివారి భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడూ మనస్సులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి.
విద్య: మేషరాశికి చెందిన వారు ఇంజినీరింగ్, వైద్యతో పాటు ఇతర టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు. ఏరోనాటికల్, రీసెర్చ్ సంబంధిత కోర్సులను చేస్తారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రగామిలుగా నిలుస్తారు.
గృహం మరియు కుటుంబం: ఈ రాశికి చెందినవారు తమ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు. అదేవిధంగా అత్యంత ప్రేమ పాత్రంగా చూసుకుంటారు. దీనితో వీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. వారు ఏదైనా ఆదేశిస్తే యావత్ కుటుంబం తూ.చ తప్పకుండా పాటిస్తుంది. మొత్తం మీద అత్యంత క్రమశిక్షణ కలిగినవారుగా ఉంటారు.
సహజమైన బలహీనతలు: ఈ రాశివారు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టిపెడతారు. వీరికి కోపం ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా తట్టుకోలేరు. దీనివల్ల వీరు ప్రతికూల సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రాశిలో కొంతమంది తప్పులు చేసినా వాటిని అంగీకరించటానికి ససేమిరా అంటారు. దానివల్ల వీరు ఆతర్వాత భారీగానే నష్టపోతారు.
వ్యక్తిత్వం: మేషరాశివారు ఉదార స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ తమ లక్ష్యాన్నిపూర్తిచేసుకోవాలనే సత్ససంకల్పంతో ఉంటారు. ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువ. అలాగే అందరినుంచి ఇదే భావాలను తిరిగి పొందుతారు.