Loading...
loading

వృషభరాశివారి లక్షణాలు, గుణగణాలు

  • Home
  • Blog
  • వృషభరాశివారి లక్షణాలు, గుణగణాలు

వృషభరాశివారి లక్షణాలు, గుణగణాలు

వృషభరాశివారి శరీరం ఆరోగ్యం, ఆదాయం అదృష్టం, లక్షణాలు, గుణగణాలు, ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబం, బలహీనతలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం..!!

కృత్తిక 2,3,4 పాదాలు,  రోహిణి 1,2 ,3,4 పాదాలు మరియు మృగశిర 1,2 పాదాలలో జన్మించినవారు వృషభ రాశికి చెందుతారు. 

వృషభం అనగా ఎద్దు.  ఈ రాశివారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రములో ఈ రాశి  రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు.  స్థిరత్వముగా ఉండుట,  ఆనందముగా ఉండుట,  వాత్సల్యము కలిగి ఉండుట,  ధృఢత్వం కలిగి ఉండుట,  అచంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశివారికి మూల సూత్రములు.

వృషభరాశివారు దయ, దానగుణము, క్షమాగుణము కలిగి వుంటారు. ఎవరైననుగాని వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు. వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు.  వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు.

వృషభరాశివారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు. అదృష్టానికి దగ్గరగా జీవితము నడుస్తుంది.  విలాసవంతమైన జీవితము గడుపుతారు. ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధము ఉండదు. వివాహానంతర జీవితము బాగుంటుంది.

వృషభరాశివారు ఆనందంగా జీవిస్తారు.  వీరు అందమైన,  కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు.  దానికొరకు ఎంతో ధనవ్యయం చేస్తారు‌.  మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం.  మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పనియందు  అలసట చెందక, ఓపికతో కష్టపడి పనిచేయు మనస్తత్వం కలవారు.

వృషభరాశివారు సహనము ఎప్పటికీ కోల్పోరు. వృషభరాశివారికి కోపము ఎంతో త్వరగా వస్తుంది. మరియు వచ్చిన కోపము తగ్గుట చాలా కష్టం. వృషభరాశివారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు.  దానివలన మొండితనం పెరిగి  నష్టం చేకూరుతుంది.  కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి.  వృషభరాశివారు ప్రేమకు లొంగిపోతారు. 

వృషభరాశివారు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములనైనా సులభంగా చేస్తారు.  అయితే వీరు పొగడ్తలకు లొంగరు. వృషభరాశివారు తమకు అప్పజెప్పిన పని సవ్యంగా చేయుటయేకాక, ఇతరులచేత చాకచక్యంగా పని చేయించు నేర్పరితనం కలవారు.

వృషభరాశివారు ధనసంపాదన విషయంలో అదృష్టవంతులని చెప్పవచ్చు. అయితే వీరికి విలాసముల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయు బుద్ధి కలదు. వీరి జాతకాన్ని పరిశీలిస్తే,  పెద్ద వ్యాపారంలోగాని, స్పెక్యులేషన్లో గాని, నష్టపోవు అవకాశము కలదు.

వృషభరాశివారు సాంఘిక కార్యక్రమాలలో బాగా రాణిస్తారు.  ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించుటవంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలయందు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండును.  మిగిలిన రాశులకు కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది.

ఏదైనా కార్యక్రమము నందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపక పోవుట వలన వీరి ఆరోగ్యము క్రమముగా క్షీణించే అవకాశం కలదు. ఈ వృషభరాశివారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం కలదు.

వృషభరాశికి అదృష్టపురంగు తెలుపు, అదృష్టసంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. ఈ రాశివారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి, మంచి పదవులు, పొందే అవకాశం ఉంటుంది. మంచి ధనసంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది.

వృషభరాశివారు చాలావరకూ ఇతరుల మాటలను లక్ష్యపెట్టరు. వయసులో వీరు శ్రమపడని కారణంగా, కష్టించి పని చేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారుగాని తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక్క జ్యేష్ట కుమార్తె విషయములో మాత్రమే మినహాయింపు ఉంటుంది. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీళ్ళకి వీలునామాలు లాభిస్తాయి.

వృషభరాశివారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువులనుంచి, జీవిత భాగస్వామివైపునుంచి, చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది. వృషభరాశిలో జన్మించిన పురుషులు ధృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు.

వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. ఎంతటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా వుంటారు.

వృషభరాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు. వృషభరాశివారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు. తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదే విధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ  రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది.

మనస్తత్వం : చాలా మంది వీరికి దూరంగా ఉంటారు. అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్దం. ప్రతి ఒక్కరినీ కలుపుపోయే అలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది.

ఆర్థిక స్థితి : పెద్దల ఆస్తులు సంక్రమించటంవల్ల ఈ రాశికి చెందినవారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలువదు. మంచి నీళ్లలా ఖర్చవుతుంది. అందువల్ల ధనసంబంధ విషయాలను తమ భాగస్వాములకుగానీ, తల్లి దండ్రులకుగానీ అప్పగించటం ఎంతైనా మేలు.

ఆదాయం మరియు అదృష్టం: ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలను తెలుసుకోవటానికి ఉత్సాహం చూపించటంతోపాటు తమకు తెలిసిన విషయాలను పదిమందికి చెప్పాలని చూస్తారు.

ప్రేమసంబంధం: వీరు ఎప్పుడూ పిల్లాపాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లలు వలే బావించటంవల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ప్రేమంటే వీరికి ప్రాణం.

వ్యాపారం: భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళతారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదినాభివృద్ధి సాధిస్తారు. దీనితోపాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశి వారు గ్లాసు, పేపరు పరిశ్రమల జోలికి వెళ్లకపోవటం మంచిది.

గుణగణాలు: వృషభ రాశికి చెందినవారు ధృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్నిఆరాధించే హృదయం కలిగినవారుగా ఉంటారు. ఓర్పు, సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి.

దాంపత్య జీవితం: వృషభ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ, దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణగణాలతో అపూర్వమైన శక్తి యుక్తులను కలిగి ఉంటారు. ఈ గుణాల వల్ల వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం గల భాగస్వాములను సంపాదించుకోగలుగుతారు.

విద్య: అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు వృషభ రాశికి చెందినవారు.

గృహం మరియు కుటుంబం: వృషభ రాశికి చెందినవారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారై ఉటారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేవారుగా వృషబ రాశికి చెందినవారు ఉంటారు.

సహజమైన బలహీనతలు: ఈ రాశి వారు తమకంటూ స్వంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు. అత్యంత బద్దకస్తులు, ఎవరికి లొంగని వారు గానూ ఉంటారు. ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించటానికి వెనుకాడని వారుగా ఉంటారు.

వ్యక్తిత్వం: వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళుతుంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలం అవుతాయి. ఏదిఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం.

ఆరోగ్యం: ఆరోగ్యరీత్యా వృషభరాశివారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వీరి గ్రహస్థితి ఆరోగ్యరీత్యా అశుభ ఫలితాలను వ్యక్తికరించటంవల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు, నేత్ర వ్యాధులు, పాండు రోగం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవటంద్వారా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

X